టిడిపి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వైసీపీ నాయకులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అందరినీ ఒకేలా చూశామన్నారు. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, అవమానాలు, దౌర్జన్యాలు, దాడులు సర్వసాధారణం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మాచవరంలోని మల్లవోలులో నిన్న నిర్వహించిన ‘పల్లె పిలుస్తోంది’ కార్యక్రమంలో యరపతినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రలో అరాచకం రాజ్యమేలుతోందని, అభివృద్ధి అనేది మచ్చుకైనా లేదని అన్నారు. గ్రామాల్లో పెళ్లిళ్లు, ఊరేగింపులకు కూడా వైసీపీ నేతల అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులందరూ తమకు శత్రువులు కాదని, కానీ తమ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వారికి మాత్రం టీడీపీ అధికారంలోకి వచ్చాక ‘అఖండ’ సినిమా చూపిస్తామని హెచ్చరించారు. పిన్నెల్లి, తురకపాలెం, మోర్జంపాడు గ్రామాల్లోని టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడులను మర్చిపోలేమన్నారు.
నాడు ఎన్టీఆర్ ‘తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదిలిరా’ అన్న స్ఫూర్తితోనే గురజాల నియోజకవర్గంలో ‘పల్లె పిలుస్తోంది’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. రెండువేల ఎకరాల ప్రభుత్వ భూములపై మండలంలోని వైసీపీ నేతలు బినామీ పేర్లతో బ్యాంకులు, సొసైటీల్లో కోట్లాది రూపాయల రుణాలు తీసుకున్నారని, తాము అధికారంలోకి వచ్చాక విచారణ జరిపి అందరినీ జైలుకు పంపుతామని యరపతినేని హెచ్చరించారు.