అమరావతి : వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్, ఫైబర్ నెట్‌వర్క్, ఇసుక కుంభకోణం, మైనింగ్, బైజూస్ కుంభకోణంతోపాటు మొత్తం 32 కేసులు కొలిక్కి వచ్చాయని ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. నిన్న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జమ్మలమడుగులోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి వైఎస్సార్ హయాంలోని మూడు ముఖ్యమైన కేసుల్లో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇరుక్కున్నారని, ఇక తప్పించుకోలేరని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సుధీర్‌రెడ్డి, అవినాశ్ రెడ్డి పదేపదే దేవగుడి గ్రామానికి వచ్చి వైఎస్సార్‌కు నివాళులు అర్పించేవారని, ఇప్పుడు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
అభివృద్ధిలో జమ్మలమడుగు దేశంలోని మొదటి నాలుగు స్థానాల్లో నిలవబోతోందని ఆదినారాయణరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై, సుధీర్‌రెడ్డి, అవినాశ్ రెడ్డి ఆటలు సాగవని హెచ్చరించారు. మరోమారు కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆస్తుల కల్పన, పరిరక్షణ కోసమే కేంద్రం వక్ఫ్ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టినట్టు తెలిపారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భూపేష్‌రెడ్డి మరింత కష్టపడితే తన కంటే పెద్ద నాయకుడు అవుతారని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలిచేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అన్ని స్థానాల్లోనూ గెలుస్తామని ఆదినారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.