హైదరాబాద్: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్ (IMPS) లావాదేవీలపై ఇప్పటివరకు ఉన్న ఉచిత సదుపాయాలను రద్దు చేస్తూ, కొత్త సేవా రుసుములను ఖరారు చేసింది. సవరించిన ఈ ఛార్జీలు 2026 ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి రానున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది.
పెరుగుతున్న మెయింటెనెన్స్ ఖర్చుల కారణంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, YONO యాప్ ద్వారా జరిగే కొన్ని భారీ IMPS ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు వసూలు చేయాలని బ్యాంక్ నిర్ణయించింది. ఇకపై ఆన్‌లైన్ వేదికగా చేసే లావాదేవీల మొత్తాన్ని బట్టి ఛార్జీలు వర్తించనున్నాయి.
IMPS అంటే ఏమిటి?
IMPS అంటే ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్. ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆధ్వర్యంలో నడిచే తక్షణ నగదు బదిలీ వ్యవస్థ. ఈ సేవ ద్వారా యూజర్లు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, ఎస్సెమ్మెస్ వంటి ఛానెళ్ల ద్వారా 24/7—సెలవు రోజుల్లో కూడా—క్షణాల్లో డబ్బు పంపించుకోవచ్చు. UPI లిమిట్ దాటినప్పుడు లేదా పెద్ద మొత్తంలో నగదు బదిలీ అవసరమైనప్పుడు ఎక్కువగా IMPSని వినియోగిస్తుంటారు.
కొత్త IMPS ఛార్జీల వివరాలు (ఆన్‌లైన్ లావాదేవీలకు):
-
రూ. 25,000 వరకు – ఎలాంటి ఛార్జీలు లేవు (ఉచితం)
-
రూ. 25,001 నుంచి రూ. 1 లక్ష వరకు – రూ. 2 + జీఎస్‌టీ
-
రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు – రూ. 6 + జీఎస్‌టీ
-
రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు – రూ. 10 + జీఎస్‌టీ
అయితే, బ్యాంక్ బ్రాంచ్ ద్వారా చేసే IMPS లావాదేవీలపై ఎలాంటి మార్పులు చేయలేదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. బ్రాంచ్‌కు వెళ్లి నేరుగా చేసే లావాదేవీలకు ఇప్పటివరకు ఉన్న పాత ఛార్జీలే కొనసాగుతాయి. లావాదేవీ మొత్తాన్ని బట్టి రూ. 2 నుంచి రూ. 20 వరకు ఛార్జీలు వసూలు చేస్తారు.
కొన్ని ఖాతాలకు మినహాయింపు
ఈ కొత్త ఛార్జీల నుంచి కొన్ని ప్రత్యేక ఖాతాలకు ఎస్‌బీఐ మినహాయింపు ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్, డిఫెన్స్, రైల్వే, పోలీస్ వంటి శాలరీ అకౌంట్లకు ఈ ఛార్జీలు వర్తించవు. అలాగే శౌర్య ఫ్యామిలీ పెన్షన్ అకౌంట్, ఎస్‌బీఐ RISHTEY వంటి ప్రత్యేక ఖాతాదారులకు IMPS సేవలు ఉచితంగానే కొనసాగుతాయని బ్యాంక్ తెలిపింది.
ఈ మార్పులతో భారీ మొత్తాల ఆన్‌లైన్ లావాదేవీలు చేసే కస్టమర్లు అదనపు భారాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.








