విజయనగరం/జియ్యమ్మవలస : రాజకీయాల్లో విజయం అనేది రాత్రికి రాత్రే దక్కేదికాదని, అది నిరంతర పోరాటం, ఓర్పు, పార్టీ పట్ల అచంచలమైన విశ్వాసంతోనే సాధ్యమవుతుందనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు డొంకాడ రామకృష్ణ. కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక ఘట్టంగా నిలిచింది.
అట్టహాసంగా బాధ్యతల స్వీకారం
శుక్రవారం విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. పూలమాలలు, బాణాసంచా హోరు, కార్యకర్తల నినాదాల నడుమ డొంకాడ రామకృష్ణ అధికారికంగా చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రంథాలయాలు విద్యా వికాసానికి కేంద్రాలని, వాటిని మరింత బలోపేతం చేసి యువతకు జ్ఞాన మార్గాన్ని విస్తరించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన నాయకుడు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి రామకృష్ణ రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేస్తూ భావోద్వేగంగా మాట్లాడారు. రామకృష్ణ కేవలం పదవుల కోసం పనిచేసే వ్యక్తి కాదని, పార్టీ కష్టకాలంలో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వెనకడుగు వేయకుండా పోరాడిన నాయకుడని ఆమె కొనియాడారు. అక్రమ కేసులు, అనేక ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని దీక్షతో నిలబడ్డారని ప్రశంసించారు.
పార్టీ కోసం ఆయన పడిన కష్టానికి, చిందించిన చెమట చుక్కకు దక్కిన ప్రతిఫలమే ఈ పదవి అని కార్యక్రమానికి హాజరైన నేతలు, కార్యకర్తలు పరస్పరం చర్చించుకోవడం విశేషంగా మారింది.
కూటమి నేతల సంఘీభావం
ఈ బాధ్యతల స్వీకార కార్యక్రమం రాజకీయ వేడుకను తలపించింది. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి హాజరై రామకృష్ణకు అండగా నిలిచారు. అలాగే బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు తదితర ప్రముఖుల హాజరు, డొంకాడ రామకృష్ణకు పార్టీలో ఉన్న ప్రాధాన్యతను స్పష్టంగా చాటిచెప్పింది.
కార్యకర్తల కృషికి గుర్తింపుగా ఈ పదవి నిలిచిందని, రాబోయే రోజుల్లో గ్రంథాలయ వ్యవస్థను మరింత ప్రజల దగ్గరకు తీసుకెళ్లేలా రామకృష్ణ పనిచేస్తారని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.








