తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఆర్డీవో జయ చంద్రా రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సెంటర్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆర్డీవో మాట్లాడుతూ, తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో ఓటు హక్కు కలిగి ఉండి ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అర్హులైన ఉద్యోగులు తూప్రాన్ మున్సిపల్ కార్యాలయానికి స్వయంగా హాజరై, ఎన్నికల విధులు కేటాయించబడినట్లు ఉన్న ధృవీకరణ పత్రం (ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్)తో పాటు ఓటర్ ఐడీ కార్డు సమర్పించి, పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించిన దరఖాస్తు ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుందని వివరించారు.
ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. తూప్రాన్ మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు కలిగి ఉండి, ఎన్నికల విధుల కారణంగా పోలింగ్ కేంద్రానికి ప్రత్యక్షంగా హాజరుకాలేని ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
అలాగే, 11-02-2026 (బుధవారం) రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆర్డీవో తెలిపారు. ఆ రోజున స్థానిక సెలవు ప్రకటించినందున అర్హులైన ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
పోలింగ్ సిబ్బందికి సంబంధించిన మెటీరియల్ పంపిణీ 10-02-2026 (మంగళవారం) రోజున మనోహరాబాద్ మండలం, లింగారెడ్డిపేట్ గ్రామ పరిధిలోని నోబల్ ఫార్మసీ కాలేజీలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇదే కేంద్రంలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్‌తో పాటు కౌంటింగ్ కూడా జరుగుతుందని తెలిపారు.
కాగా, 13-02-2026 (శుక్రవారం) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై, ఫలితాల ప్రకటన జరుగుతుందని ఆర్డీవో జయ చంద్రా రెడ్డి పేర్కొన్నారు. కౌంటింగ్ సెంటర్ చుట్టూ 200 మీటర్ల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.








