విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో రెండో నిందితుడిగా (A2) ఉన్న వాసుదేవరెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు.
అతన్ని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఫిబ్రవరి 27 వరకు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు వాసుదేవరెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సిట్ పలు కీలక విషయాలను వెల్లడించింది. ఈ మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి పాత్ర అత్యంత కీలకమని పేర్కొంది. సాంకేతిక ఆధారాలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, సాక్షుల వాంగ్మూలాలు ఆయన ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) కార్యకలాపాలు ఆన్లైన్లో ఉన్నప్పటికీ, అనుమతులు లేకుండా వాటిని మ్యాన్యువల్ విధానానికి మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది.
ఈ కుంభకోణంలో ఒక సిండికేట్గా ఏర్పడి అధికారులు, సిబ్బందిని ప్రభావితం చేశారని, A1 రాజశేఖర్ రెడ్డి మరియు అతని అనుచరుల ద్వారా సెటిల్మెంట్లు జరిగినట్లు రిపోర్టులో వివరించింది.








