contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హైదరాబాద్‌లో రెబెల్ ఫుడ్స్‌పై దాడులు

హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ రెబెల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్లౌడ్ కిచెన్‌పై ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన పెరుగుతో మింట్ చాస్ (మజ్జిగ) తయారు చేస్తున్నట్లు గుర్తించడంతో పాటు పలు ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అధికారులు నిర్వహించిన తనిఖీల్లో జూలై 5, జూలై 8 తేదీలతో గడువు ముగిసిన మొత్తం 11 పెరుగు ప్యాకెట్లను ఆహార తయారీలో వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అలాగే జూలై 4వ తేదీకే గడువు తీరిన ఇండియన్ గ్రేవీని కూడా వంటల్లో ఉపయోగించేందుకు నిల్వ ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.

తనిఖీల సందర్భంగా వంటశాలలోని వాష్ ఏరియా అపరిశుభ్రంగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, ఆహార తయారీలో పనిచేస్తున్న సిబ్బంది సమర్పించిన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లలో మార్పులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తూ వాటి వాస్తవికతపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ క్లౌడ్ కిచెన్ ద్వారానే ఓవెన్ స్టోరీ, బెహ్రూజ్, ఫాసోస్, స్వీట్ ట్రూత్, వెండీస్, లంచ్‌బాక్స్ వంటి ప్రముఖ ఫుడ్ బ్రాండ్ల ఆహారం వినియోగదారులకు సరఫరా అవుతోంది. అయితే తనిఖీల్లో కృత్రిమ రంగులను వినియోగించకపోవడం, సిబ్బంది హెయిర్‌నెట్‌లు ధరించడం వంటి కొన్ని ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ అవుట్‌లెట్‌కు హైజీన్ స్కోర్‌లో 100కి 78 మార్కులు లభించాయి.

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న గడువు ముగిసిన పెరుగు, గ్రేవీతో పాటు ఇతర ఉత్పత్తులను అధికారులు వెంటనే స్వాధీనం చేసుకుని నాశనం చేయించారు. గుర్తించిన లోపాలను తక్షణమే సరిదిద్దాలని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్‌కు ‘ఇంప్రూవ్‌మెంట్ నోటీసు’ జారీ చేశారు.

సైబరాబాద్ పరిధిలోని రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లపై కొనసాగుతున్న ప్రత్యేక తనిఖీల్లో భాగంగానే ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ క్లౌడ్ కిచెన్‌లో తయారైన ఆహారం కారణంగా ఇప్పటివరకు వినియోగదారుల నుంచి ఎలాంటి అనారోగ్య ఫిర్యాదులు అందలేదని స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :