హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గంజాయి లావాదేవీలు, ఓ యువతి విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో స్నేహితులే ఓ యువకుడిని కిరాతకంగా కొట్టి చంపిన ఘటన హయత్‌నగర్ మండలం పసుమాముల గ్రామంలో కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, పసుమాముల గ్రామానికి చెందిన నిషాని సుహాస్ (22) గంజాయికి బానిసగా మారడంతో పాటు, గంజాయి విక్రయాల్లో కూడా పాల్గొనేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో తన స్నేహితుడి మొబైల్ ఫోన్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతికి అసభ్యకర సందేశాలు పంపడం, అనుచితంగా ప్రవర్తించడం వల్ల స్నేహితుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఆ యువతి నిందితుల్లో ఒకరి ప్రేయసి కావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనికి తోడు గంజాయి విక్రయాలకు సంబంధించిన పాత నగదు లావాదేవీల వివాదం కూడా కారణమైనట్లు పోలీసులు భావిస్తున్నారు.
బుధవారం తెల్లవారుజామున నిందితులు సుహాస్‌ను ఇంటి నుంచి బయటకు పిలిచి గ్రామ శివార్లలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు సుహాస్ సుమారు అర కిలోమీటరు మేర పరుగెత్తినా, నిందితులు వెంబడించి పట్టుకుని మళ్లీ దాడి చేశారు. మర్మావయవాలతో పాటు శరీరమంతా తీవ్రంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
హత్య అనంతరం నిందితులు మృతదేహాన్ని పెద్ద అంబర్‌పేట్–పసుమాముల రహదారిపై శ్మశానవాటిక సమీపంలోని సిమెంట్ బెంచీపై పడేసి అక్కడి నుంచి పరారయ్యారు.
తన కుమారుడిని చెడు అలవాట్ల నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో తల్లి నందిని ఇటీవల సికింద్రాబాద్ నుంచి పసుమాముల గ్రామానికి నివాసం మార్చినట్లు తెలిసింది. అయితే, కొద్ది రోజులకే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర శోకం నెలకొంది.
ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.








