కీవ్/మాస్కో: రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చమురు శుద్ధి కర్మాగారాలు, ఇంధన నిల్వ కేంద్రాలపై ఉక్రెయిన్ తన డ్రోన్ దాడులను మరింత ముమ్మరం చేసింది. రష్యాలోని స్టావ్రోపోల్, ట్వెర్, ఉఫా ప్రాంతాలతో పాటు క్రిమియాలోని కీలక చమురు పంపింగ్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు.
యుద్ధాన్ని ముగించేందుకు రష్యా నిరాకరిస్తున్నందునే ఈ దాడులను తీవ్రతరం చేసినట్లు జెలెన్స్కీ తెలిపారు. రష్యా తన వైఖరిని మార్చే వరకు అక్కడ ప్రతి రోజూ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తామని ఆయన హెచ్చరించారు.
ఉక్రెయిన్ దళాలు నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నిర్వహించిన డ్రోన్ దాడుల్లో రష్యాలోని పలు చమురు డిపోలు లక్ష్యంగా మారాయి. మొత్తం ఆరు ఇంధన నిల్వ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే అజోవ్ సముద్రంలో ప్రయాణిస్తున్న రెండు చమురు ట్యాంకర్లపై కూడా డ్రోన్ దాడులు జరిగినట్లు సమాచారం.
ఈ దాడుల ప్రభావంతో రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు, ఉక్రెయిన్ ప్రయోగించిన 73 డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అదే సమయంలో రష్యా ప్రయోగించిన 94 డ్రోన్లు, రెండు బాలిస్టిక్ క్షిపణుల్లో 72 డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నామని ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది.
పరస్పర డ్రోన్ దాడులు, క్షిపణి దాడులతో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఘర్షణలు కొత్త దశకు చేరుకున్నాయి.








