హైదరాబాద్: ప్రజల ప్రయోజనాల విషయంలో తనకు తెలంగాణే మొదటి ప్రాధాన్యమని, ఆ తర్వాతే పార్టీ, వ్యక్తిగత అంశాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తాను ఎవరో చెప్పినట్లు మాట్లాడే వ్యక్తిని కాదని పేర్కొంటూ, సాగునీటి నిర్వహణ, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు.
హైదరాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రాజెక్టుల్లోకి సమృద్ధిగా నీరు వస్తున్నప్పటికీ ప్రభుత్వం పంప్‌హౌస్‌లలో మోటార్లు ప్రారంభించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. వర్షాకాలంలో కూడా సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ కాల్వల కింద బోర్లు, బావులు లేకుండా వ్యవసాయం చేయడం సాధ్యం కాదన్నారు.
తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, ఆత్మగౌరవం కోసం జరిగిందని గుర్తుచేసిన ఆయన, రాజకీయాలు, సిద్ధాంతాలు వేరైనా ఉద్యమ లక్ష్యాలను మరచిపోవద్దని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం ద్వారా ప్రాణహిత జలాలను వినియోగించే ప్రణాళిక రూపొందిందని, శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి ప్రాజెక్టులకు అప్పుడే శ్రీకారం చుట్టారని తెలిపారు.
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును అభివృద్ధి చేసి ఎల్లంపల్లికి నీటిని తరలించే వ్యవస్థ ఏర్పాటు చేశారని ఈటల చెప్పారు. ప్రస్తుతం మిడ్ మానేరు ప్రాజెక్టులో ఉన్న 29 టీఎంసీల నీరు కూడా అదే వ్యవస్థ ద్వారా చేరిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే హుజూరాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో రెండు పంటలు సాగు చేసే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు, డిజైన్ మార్పులపై తాను మాట్లాడడం లేదని స్పష్టం చేసిన ఈటల, మొత్తం ప్రాజెక్టునే తప్పుపట్టడం సరికాదని కాంగ్రెస్ నాయకులపై విమర్శలు గుప్పించారు. దెబ్బతిన్న నిర్మాణాలకు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రం తీవ్ర నీటి కొరత, కరవు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.








