సియోల్/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రంగంలో దేశానికే ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతోందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. “సుస్థిర ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0” కింద రాష్ట్రంలో సమగ్ర ఈవీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొంటూ, ఈ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని దక్షిణ కొరియా సంస్థలకు ఆయన ఆహ్వానం పలికారు.
దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్‌లో కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ (KAICA) ఛైర్మన్ టేక్-సుంగ్ లీ నేతృత్వంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేశ్ పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.
రాష్ట్రంలో ఈవీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరిస్తూ, ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను పూర్తిస్థాయిలో విద్యుదీకరించడం, గ్రీన్ కారిడార్లలో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం, పుంగనూరులో ప్రత్యేక ఈవీ క్లస్టర్‌ను అభివృద్ధి చేయడం వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ-మొబిలిటీ నగరాల అభివృద్ధికి, ఈవీ పరిశోధనలకు ప్రత్యేక గ్రాంట్లు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈవీ బ్యాటరీలు, మాగ్నెట్‌ల తయారీకి అవసరమైన ముడిసరుకుల సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ‘రేర్ ఎర్త్ కారిడార్’ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కీలక ప్రకటన చేశారు. ఇది దేశంలో ఈవీ పరిశ్రమ అభివృద్ధికి కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో ఇప్పటికే బలమైన ఆటోమోటివ్ పరిశ్రమ ఉన్నదని, చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో సుమారు 100 కిలోమీటర్ల మేర ఆటోమోటివ్ విడిభాగాల తయారీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని లోకేశ్ తెలిపారు. కియా మోటార్స్‌తో పాటు అశోక్ లేలాండ్, ఇసుజు, హీరో మోటోకార్ప్, అమర్ రాజా, అపోలో టైర్స్, భారత్ ఫోర్జ్ వంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని గుర్తు చేశారు. అశోక్ లేలాండ్ రూ.2,500 కోట్ల పెట్టుబడితో లిథియం అయాన్ ఈ-బస్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు.
“అనంతపురంలోని కియా మోటార్స్ విజయమే మా ప్రభుత్వ పారిశ్రామిక విధానానికి నిదర్శనం” అని పేర్కొన్న లోకేశ్, కొరియా కంపెనీల కోసం రెండు ప్రత్యేక ఆటో కాంపోనెంట్స్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఒకటి కియా క్లస్టర్ సమీపంలో, మరొకటి శ్రీ సిటీ–చిత్తూరు–తిరుపతి కారిడార్‌లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ పార్కుల్లో ప్లగ్-అండ్-ప్లే షెడ్లు, ఉమ్మడి టెస్టింగ్ సెంటర్లు, పెట్టుబడిదారులకు సహాయంగా ప్రత్యేక ‘కొరియా డెస్క్’ కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దేందుకు ఏపీఎస్ఎస్‌డీసీ, కౌశలం ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈవీ పవర్‌ట్రెయిన్‌ల తయారీలో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రత్యేక అకాడమీ ఏర్పాటు చేయాలని, ఇందుకు రాష్ట్రంలోని 250కు పైగా ఇంజనీరింగ్ కళాశాలలతో కలిసి పనిచేయాలని కొరియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్–దక్షిణ కొరియా పారిశ్రామిక సంబంధాల








