గుంతకల్లు, అనంతపురం జిల్లా, గురువారం: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మత్తూరు కు పలు కీలక వినతులు సమర్పించబడ్డాయి. గుంతకల్లు పట్టణానికి ఆయన విచ్చేసిన సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్‌సీఐ స్టేట్ డైరెక్టర్ వనగొంది లక్ష్మి ప్రత్యేక ఆహ్వానం పలికి, రైల్వే సేవల అభివృద్ధికి సంబంధించిన సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం నడుస్తున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ (17023) కర్నూలు–సికింద్రాబాద్ మధ్య మాత్రమే పరిమితమై ఉందని తెలిపారు. ఈ రైలు మధ్యాహ్నం 12:30 గంటలకు కర్నూలుకు చేరుకుని, తిరిగి 15:00 గంటలకు బయలుదేరి రాత్రి 7:55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని పేర్కొన్నారు. రాత్రంతా సికింద్రాబాద్‌లో ఖాళీగా ఉండే ఈ రైలును గుంతకల్లు వరకు పొడిగించాలని కోరారు. దీనివల్ల ముఖ్యంగా వైద్య చికిత్స కోసం కర్నూలుకు వెళ్లే రోగులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని వివరించారు.
అలాగే డోన్ నుండి హుబ్లీ వరకు నేరుగా రైలు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో హుబ్లీ–విజయవాడ మధ్య నడిచిన రైలును రద్దు చేయడంతో బళ్ళారి, హోస్పేట, హుబ్లీ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అసౌకర్యం పెరిగిందని పేర్కొన్నారు. కాబట్టి ఆ రైలును తిరిగి పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
రైల్వే విభాగంలో సిబ్బంది సమస్యలపై కూడా ఆమె దృష్టి సారించారు. వ్యక్తిగత విభాగంలో ఫిర్యాదులను పరిష్కరించేందుకు సీనియర్ డిపిఓ అందుబాటులో లేకపోవడంతో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే ఆ పోస్టును భర్తీ చేయాలని కోరారు.
గుంతకల్లు రైల్వే ఆసుపత్రిలో వైద్య సౌకర్యాల లోపం కూడా ప్రస్తావించారు. అదనపు ఫిజీషియన్ లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, ప్రస్తుతం ఉన్న వైద్యుడు పరిమిత టోకెన్లు మాత్రమే ఇవ్వడం వల్ల షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సరైన చికిత్స అందడం లేదని తెలిపారు. వెంటనే మరో ఫిజీషియన్‌ను నియమించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గుర్రం సూర్యనారాయణ (స్టేట్ కౌన్సిల్ మెంబర్), జీఎం మహేష్ (ఓబీసీ స్టేట్ ఎగ్జిక్యూటివ్), జిలకర విక్రమ్ (బీజేపీ యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు) తదితరులు పాల్గొన్నారు.








