contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పలు కులాల పేర్లు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్, మే 8: తెలంగాణలోని వెనుకబడిన తరగతుల (బీసీ) చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్ సమర్పించిన నివేదికను సమగ్రంగా పరిశీలించిన రాష్ట్ర కేబినెట్, పలు కులాల పేర్లలో మార్పులు చేస్తూ వాటికి గౌరవప్రదమైన పర్యాయపదాలను జోడిస్తూ ఆమోదం తెలిపింది. సమాజంలో కించపరిచేలా లేదా అవమానకరంగా భావించే పదాలను అధికారిక రికార్డుల నుంచి తొలగించి, ఆయా వర్గాల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా కొత్త పేర్లను ఖరారు చేసింది.

ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ మార్పులు త్వరలోనే రాష్ట్ర గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయాన్ని బీసీ వర్గాల సామాజిక గౌరవాన్ని కాపాడే సంస్కరణగా ప్రభుత్వం అభివర్ణిస్తోంది.

బీసీ గ్రూప్-ఏలో కీలక మార్పులు

బీసీ గ్రూప్-ఏ విభాగంలో ప్రభుత్వం పలు విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా వరుస సంఖ్య 7లో ఉన్న ‘దొమ్మర’ అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో ‘గడ వంశీయ’ అనే పేరును చేర్చింది. అలాగే వరుస సంఖ్య 18లో ఉన్న ‘పిచ్చకుంట్ల’ అనే పదాన్ని తొలగిస్తూ, ఇకపై వారిని ‘వంశ రాజ్’గా వ్యవహరించాలని నిర్ణయించింది.

అదేవిధంగా బుడబుక్కల కులానికి ‘శివ క్షత్రియ’ అనే గౌరవప్రదమైన పర్యాయపదాన్ని జోడించింది. వీరభద్రియ కులానికి వారి విజ్ఞప్తి మేరకు ‘వీరముష్టి, నెట్టి కోటల’ అనే పదాలను అధికారిక పర్యాయపదాలుగా చేర్చింది.

రజక, చాకలి వర్గాలకు సంబంధించిన ‘వన్నార్’ అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో ‘ధోబీ’ అనే పదాన్ని చేర్చడం ద్వారా స్పష్టమైన సామాజిక గుర్తింపును కల్పించే ప్రయత్నం చేసింది.

బీసీ గ్రూప్-డీలోనూ సామాజిక స్పృహతో నిర్ణయాలు

బీసీ గ్రూప్-డి విభాగంలో కూడా ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ముఖ్యంగా ఎప్పటి నుంచో వివాదాస్పదంగా భావిస్తున్న ‘శూద్ర కులం’ అనే పదాన్ని అధికారిక రికార్డుల నుంచి పూర్తిగా తొలగించింది. దాని స్థానంలో ‘తమ్మలి (బ్రాహ్మణేతర)’ అనే పేరును ప్రవేశపెట్టింది.

ఇక వరుస సంఖ్య 5లో ఉన్న ‘మేర’, ‘చిప్పోలు’ కులాలకు ‘మేరు’ అనే పదాన్ని అదనంగా చేర్చింది. ఈ మార్పులతో ఆయా వర్గాలకు మరింత గౌరవప్రదమైన సామాజిక గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

విద్యార్థులు, ఉద్యోగార్థులకు ప్రయోజనం

ఈ మార్పుల వల్ల విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాల్లో గౌరవప్రదమైన పేర్లను పొందే అవకాశం ఉంటుందని బీసీ కమిషన్ పేర్కొంది. దీని ద్వారా వారి ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు సామాజికంగా గౌరవభావం కూడా పెంపొందుతుందని కమిషన్ అభిప్రాయపడింది.

సామాజిక న్యాయం, ఆత్మగౌరవ పరిరక్షణ లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీసీ సంఘాలు స్వాగతిస్తున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :