తిరుపతి జిల్లా : నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఒక ప్రభుత్వ కార్యాలయం.. కేవలం ఒక్క సంవత్సరంలోనే ఉత్తమ శ్రేణి వసతులతో కళకళలాడుతుందని ఎవరైనా ఊహించారా? దశాబ్దాల కాలంగా ప్రజలు పడుతున్న నరకయాతనకు ఒకే ఒక్క అధికారి తన సంకల్ప బలంతో చరమగీతం పాడారు. ఆయనే తిరుపతి జిల్లా, పాకాల మండల సబ్ రిజిస్ట్రార్ రహమతుల్లా. ఆయన బాధ్యతలు చేపట్టిన స్వల్ప కాలంలోనే పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించి, ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.
బ్రిటిష్ కాలం నాటి భవనం.. దశాబ్దాల నిర్లక్ష్యం!
బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి గతంలో ఎంతోమంది అధికారులు వచ్చి వెళ్లారు. కానీ, ఎవరూ ఈ కార్యాలయ కనీస వసతుల కల్పనపై దృష్టి పెట్టలేదు. గతంలో ఎండాకాలం వస్తే సూర్యుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోయేవారు; వర్షం వస్తే తలదాచుకోవడానికి చోటు లేక చెట్ల కిందో, వరండాల్లోనో తడిసి ముద్దయ్యేవారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వృద్ధులు, మహిళలు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడేవారు.
సబ్ రిజిస్ట్రార్ రహమతుల్లా ‘మార్క్’ డెవలప్‌మెంట్!
ఏడాది క్రితం ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన సబ్ రిజిస్ట్రార్ రహమతుల్లా.. ప్రజల కష్టాలను చూసి చలించిపోయారు. సమస్యలను గుర్తించడమే కాకుండా, వాటికి శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా అడుగులు వేశారు. తనదైన శైలిలో కార్యాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
అద్భుతమైన వెయిటింగ్ హాల్: పాకాల, పెనుమూరు, పులిచెర్ల వంటి పరిసర మండలాల నుండి వందలాది మంది ప్రజలు ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటారు. వారి కోసం ఎండ, వానల నుండి రక్షణ కల్పించేలా ఒక ఆధునిక, విశాలమైన వెయిటింగ్ హాలును ఏర్పాటు చేశారు.
శాంతికి ప్రతీకగా బుద్ధుని విగ్రహం: రిజిస్ట్రేషన్ల వ్యవహారాల్లో ఆందోళనగా ఉండే ప్రజల మనస్సుకు ప్రశాంతత చేకూరేలా, కార్యాలయ ప్రాంగణంలో శాంతిమూర్తి అయిన గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్టించి, కార్యాలయ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చారు.
కనీస వసతుల కల్పన: గతంలో తీవ్ర సమస్యగా ఉన్న మరుగుదొడ్ల కొరతను తీరుస్తూ, ఆధునిక బాత్రూమ్ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. కార్యాలయ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకున్నారు.
దళారీ వ్యవస్థకు బ్రేక్.. ఏజెంట్లలో మార్పు!
అభివృద్ధే కాకుండా, కార్యాలయంలో పారదర్శకతకు రహమతుల్లా పెద్దపీట వేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేసి, అమాయక ప్రజలను ఇబ్బంది పెట్టే కొంతమంది ఏజెంట్ల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదగా, బాధ్యతాయుతంగా నడుచుకోవాలని ఏజెంట్లను గట్టిగా హెచ్చరించడమే కాకుండా, వారిలో సానుకూల మార్పును తీసుకువచ్చారు.
ప్రజల నీరాజనాలు.. సర్వత్రా అభినందనల వర్షం!
ప్రభుత్వ అధికారి అంటే కేవలం కుర్చీకే పరిమితం కాకుండా, ప్రజాసేవకుడిగా మారితే వ్యవస్థ ఎలా మారుతుందో రహమతుల్లా నిరూపించారు. “ప్రభుత్వ అధికారులు అంటే ఇలాగే ఉండాలి” అంటూ పాకాల, పెనుమూరు, పులిచెర్ల మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాన్ని ఒక మోడల్ ఆఫీస్‌గా తీర్చిదిద్దిన సబ్ రిజిస్ట్రార్ రహమతుల్లాపై స్థానిక ప్రజలు, మేధావులు, రాజకీయ నాయకులు అభినందనల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి నిబద్ధత గల అధికారులు ప్రతి చోటా ఉంటే సమాజం ఎంతో బాగుపడుతుందని కొనియాడుతున్నారు.








