contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కార్మికుల దీక్షకు ఎమ్మెల్యే హరీష్ బాబు సంపూర్ణ మద్దతు

డా. పాల్వాయి హరీష్ బాబు సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని స్టాఫ్ గేట్ ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైన దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించి కార్మికులతో సంఘీభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ బాబు మాట్లాడుతూ.. మిల్లు యాజమాన్యం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండించారు. కార్మికులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఇటీవల ప్రభుత్వం నుంచి రూ.100 కోట్ల సబ్సిడీ బిల్లులు పొందినప్పటికీ, అదే సంస్థను నమ్ముకుని పనిచేస్తున్న కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దురదృష్టకరమని అన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులను తీసుకురావడం స్థానికులకు జరుగుతున్న అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లా పర్యటనకు వస్తున్న ఇంచార్జి మంత్రి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ఈ సమస్యపై వెంటనే స్పందించి మిల్లు కార్మికులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోరారు. కార్మికుల హక్కుల సాధన కోసం దశల వారీగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చిన ఆయన.. ఈ పోరాటంలో తాను ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన ఉంటానని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ విశ్వేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ సిందం శ్రీనివాస్, నాయకులు సాయి చరణ్‌తో పాటు పెద్ద సంఖ్యలో మిల్లు కార్మికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :