contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కుళ్లిన మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు : హెల్త్ ఆఫీసర్ హెచ్చరిక

తిరుపతి : నగరంలో కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసాహారం లేదా నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తే సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మేకలు, పొట్టేళ్ల కాళ్లు, తలకాయలు తదితర భాగాలను ఫ్రీజర్లలో నిల్వ ఉంచి విక్రయిస్తున్నారంటూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది.

నగరపాలక సంస్థ కమిషనర్ శారదా దేవి ఆదేశాల మేరకు శుక్రవారం 28వ వార్డు పరిధిలోని పెద్ద పీర్ల చావడి మటన్ మార్కెట్‌లో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ పారిశుధ్య సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫ్రీజర్లలో నిల్వ ఉంచి దుర్వాసన వస్తున్న భారీ మొత్తంలో మాంసాన్ని అధికారులు గుర్తించారు.

ఈ సందర్భంగా డాక్టర్ యువ అన్వేష్ మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు నాణ్యత లేని మాంసాన్ని తెచ్చి ఫ్రీజర్లలో రోజుల తరబడి నిల్వ ఉంచి, అనంతరం నగరంలోని హోటళ్లకు మరియు ప్రజలకు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇటువంటి వ్యాపారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

వ్యాపారులు తప్పనిసరిగా ఆహార భద్రతా నిబంధనలు పాటించాలని, తాజా మాంసాన్ని మాత్రమే విక్రయించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై షాపుల సీజ్‌తో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ తనిఖీల్లో పలువురు సానిటరీ ఇన్‌స్పెక్టర్లు, నగరపాలక సంస్థ పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు. నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :