కరీంనగర్ జిల్లా, గన్నేరువరం: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అందించే ఆర్థిక సాయం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆపద్బంధువుగా నిలుస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
బుధవారం గన్నేరువరం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన 29 మంది లబ్ధిదారులకు రూ.8,11,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యం, ప్రమాదాలు, అత్యవసర వైద్య చికిత్సల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సాయం ఎంతో ఉపయోగపడుతోందన్నారు.
ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వేలాది కుటుంబాలు ఉపశమనం పొందుతున్నాయని పేర్కొన్నారు. వైద్య ఖర్చుల భారం కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం పెద్ద ఊరటనిస్తోందని అన్నారు.
గోపాలపూర్‌లో కిచెన్ షెడ్, సీసీ రోడ్డు ప్రారంభం
అనంతరం గన్నేరువరం మండలం గోపాలపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన కిచెన్ షెడ్‌తో పాటు సీసీ రోడ్డును ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా శిలాఫలకాలను ఆవిష్కరించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారులు, తాగునీటి సౌకర్యాలు, విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వంట గదుల నిర్మాణంతో మధ్యాహ్న భోజన పథకం మరింత మెరుగైన వాతావరణంలో అమలు చేసే అవకాశం కలుగుతుందన్నారు.
అలాగే సీసీ రోడ్డు నిర్మాణం వల్ల గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని, వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరు
అదే రోజు గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు న్యాలపట్ల మనమ్మ–బాలయ్య దంపతుల గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దంపతులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, మండల విద్యాధికారి కె. రామయ్య, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డైరెక్టర్ అలువాల కోటి, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








