వరంగల్ : అంతర్జాతీయ మత్తు పదార్థాలు, ధూమపాన నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ సంప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్లో కాకతీయ విశ్వవిద్యాలయం బీపీఎడ్ విద్యార్థిని కినక పద్మావతి ప్రథమ విజేతగా నిలిచింది.
అదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం చింతగూడ గ్రామానికి చెందిన పద్మావతి మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వచ్చి ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయంలో బీపీఎడ్ చదువుతోంది. క్రీడలపై తనకున్న ఆసక్తి, క్రమశిక్షణతో పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తొలి స్థానాన్ని దక్కించుకుంది.
ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ, తాను చదువుతో పాటు సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నానని తెలిపింది. భవిష్యత్తులో భారత పోలీసు సేవ (ఐపీఎస్) అధికారి కావడమే తన జీవిత లక్ష్యమని పేర్కొంది. మారుమూల గిరిజన గ్రామం నుంచి వచ్చిన తనకు విద్య, క్రీడలు, కృషి ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చనే నమ్మకం ఉందని ఆమె చెప్పింది.
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఈ 2కే రన్ ద్వారా వరంగల్ పోలీస్ కమిషనరేట్ అవగాహన కల్పించింది. కార్యక్రమంలో విద్యార్థులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.








