contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలి: సీఐటీయూ

మెదక్ జిల్లా – తూప్రాన్ : తెలంగాణలో విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలకు) ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు, 2026 పే రివిజన్ కమిటీ (పీఆర్సీ)ని తక్షణమే నియమించాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్‌రావు డిమాండ్ చేశారు.

తూప్రాన్ పట్టణంలోని శివసాయి ఫంక్షన్ హాల్‌లో శనివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు ఎం. నరసింహులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యుత్ రంగంలోని సమస్యలపై విస్తృతంగా చర్చించారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ డిస్కంలకు చెల్లించాల్సిన రూ.45,398 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, వేలాది మంది ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. అలాగే 2026 ఏప్రిల్ నుంచి అమలులోకి రావాల్సిన పే రివిజన్ కమిటీని వెంటనే నియమించి కొత్త వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని ఈశ్వర్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్డీఎస్‌ఎస్ (RDSS) పథకం వల్ల డిస్కంల ఆర్థిక సమస్యలు పరిష్కారం కావని, రూ.69 వేల కోట్ల నష్టాలున్న సంస్థలకు కేవలం రూ.5 వేల కోట్ల సాయం సరిపోదని పేర్కొన్నారు.

ఆర్డీఎస్‌ఎస్‌లో చేరితే రాష్ట్రవ్యాప్తంగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తప్పనిసరిగా మారుతుందని, ఇందుకోసం వేల కోట్ల రూపాయల అదనపు భారం డిస్కంలపై పడుతుందని తెలిపారు. చివరకు ఆ భారం విద్యుత్ వినియోగదారులపై పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యుత్ సవరణ బిల్లు–2025 ద్వారా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని మరింత ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ చర్యల వల్ల రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా, క్రాస్ సబ్సిడీలపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు ప్రభుత్వ విద్యుత్ సంస్థల ఉనికికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.

ఆర్టిజన్లు, ఆన్‌లైన్ కార్మికులు, బిల్ కలెక్టర్లు, స్పాట్ బిల్లింగ్ ఉద్యోగులు ఇటీవల చేపట్టిన సమ్మె అనంతరం ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని ఆయన విమర్శించారు. సమ్మె విరమించి 75 రోజులు గడిచినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని సీఐటీయూ తరఫున తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పీఆర్సీ నియామకం ఆలస్యం కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ నిర్ణయం వల్ల పెన్షనర్లతో కలిపి సుమారు 70 వేల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ఈశ్వర్‌రావు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ రంగంలోని అన్ని కార్మిక సంఘాలు, ఇంజనీర్లు, వినియోగదారులు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఏ. మహేందర్‌రెడ్డి, టీజీయూఈఈయూ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి గుడాల రవీంద్ర ప్రసాద్, అడ్వైజర్ స్వామి, ఉపాధ్యక్షులు రాజునాయక్, నాగరాజు, సలీం, శ్రీశైలం, సురేష్, జీవన్, శీను, మల్లేష్, నర్సింలు, హనుమంతు, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :