కాగజ్‌నగర్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఎస్పీఎం కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మికుల నిరసన దీక్షలు విజయవంతంగా 58వ రోజుకు చేరుకున్నాయి. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్మికులు శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకుడు గజ్జల లక్ష్మణ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి కార్మికులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను తెలుసుకుని పూర్తి సంఘీభావం ప్రకటించారు. కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం బీజేపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
అనంతరం గజ్జల లక్ష్మణ్ మాట్లాడుతూ, గత 58 రోజులుగా కార్మికులు ఎంతో క్రమశిక్షణతో, శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం, యాజమాన్యం ఇప్పటికీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. కార్మికులు కోరుతున్న డిమాండ్లు పూర్తిగా న్యాయమైనవేనని, వాటిని వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం, యాజమాన్యంపై ఉందన్నారు.
కార్మికుల సమస్యలపై నిర్లక్ష్య వైఖరిని వీడి, సంబంధిత అధికారులు చర్చలు జరిపి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం అన్ని వర్గాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్మిక జేఏసీ నాయకులు, కార్మికులు, బీజేపీ నాయకులు మరియు పలువురు స్థానికులు పాల్గొని కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.








