జగిత్యాల : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2020 అక్టోబర్‌లో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులకు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు.
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు లోకిని రాజేష్ (ఏ1), దారంగుల సాయికుమార్ (ఏ2), మొగిలిపాక అనిల్ కుమార్ (ఏ3), కుంచెపు శివ (ఏ4), కుంచెపు వెంకటేష్ (ఏ5) కలిసి మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై అప్పట్లో మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతి (IPC)తో పాటు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసును డీఎస్పీలు గౌస్ బాబా, రవీంద్ర రెడ్డి సమగ్రంగా దర్యాప్తు చేసి, పటిష్టమైన ఆధారాలు, సాక్ష్యాలతో ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణారావు సమర్థవంతంగా వాదనలు వినిపించగా, కోర్టు డ్యూటీ అధికారులు కీలక సాక్షులను ప్రవేశపెట్టి న్యాయ ప్రక్రియను పూర్తి చేశారు.
కేసులో సమర్పించిన ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రత్న పద్మావతి ఐదుగురు నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.20 వేల జరిమానా విధించారు. అలాగే బాధిత మైనర్ బాలికకు రూ.12 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలు, బాలికలు తమపై జరిగే వేధింపులు, అన్యాయాలపై నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. నేరం చేసిన వారు ఎవరైనా చట్టం ముందు తప్పించుకోలేరని, పోలీసులు, ప్రాసిక్యూషన్ సమన్వయంతో పటిష్టమైన దర్యాప్తు, సమర్థవంతమైన న్యాయవాదనల ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ బృందం, కోర్టు సిబ్బంది మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.








