జగిత్యాల జిల్లా, మెట్పల్లి : జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఆర్.బి రెస్టారెంట్లో బిర్యానీలో ప్లాస్టిక్ ముక్క బయటపడిన ఘటనపై రిపోర్టర్ టీవీ ప్రచురించిన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు. సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలు లోపాలను గుర్తించారు.
ఆదివారం బిర్యానీ తింటున్న ఓ యువకుడికి ఆహారంలో ప్లాస్టిక్ ముక్క కనిపించడంతో ఈ ఘటన కలకలం రేపింది. ఈ విషయాన్ని రిపోర్టర్ టీవీ వెలుగులోకి తీసుకురావడంతో ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు.
తనిఖీల సందర్భంగా రెస్టారెంట్ కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు, ఆహార తయారీ, నిల్వ, పరిశుభ్రతకు సంబంధించిన భద్రతా ప్రమాణాలను సక్రమంగా పాటించడం లేదని అధికారులు గుర్తించారు. సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార నిల్వ విధానాలు, వంటశాల నిర్వహణలోనూ పలు లోపాలు ఉన్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష మాట్లాడుతూ, ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ సెక్షన్–54 కింద కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే రెస్టారెంట్‌పై గతంలో కూడా పలు ఫిర్యాదులు అందాయని, ఇప్పటికే యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే హోటళ్లు, రెస్టారెంట్లపై ఎలాంటి రాజీ ఉండదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఆహారంలో నాణ్యత లోపాలు, అపరిశుభ్ర పరిస్థితులు లేదా కల్తీ అంశాలు గమనించిన వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనతో మెట్పల్లి పట్టణంలో ఆహార భద్రత అంశంపై మరోసారి చర్చ ప్రారంభమైంది. హోటళ్లలో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ కలకలం.. మెట్పల్లి రెస్టారెంట్‌పై వినియోగదారుల ఆగ్రహం
Food Safety Scare: Plastic Piece Discovered in Biryani at RB Restaurant








