contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రామ్‌నగర్‌లో విస్తృత కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్

కరీంనగర్ : ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా కరీంనగర్ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌నగర్ ప్రాంతంలో విస్తృత కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. అదనపు డీసీపీ (లా అండ్ ఆర్డర్) వెంకటరమణ, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, II టౌన్ ఇన్‌స్పెక్టర్ సృజన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు స్థానిక ప్రజలతో నేరుగా సమావేశమై భద్రత, నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో అధికారులు మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత లింక్‌లను క్లిక్ చేయకూడదని, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేకంగా మాట్లాడిన అధికారులు గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని పేర్కొన్నారు. కాలనీలు, పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా డ్రగ్స్‌కు సంబంధించిన కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొంటూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, అధిక వేగంతో ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు.

కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా రామ్‌నగర్ ప్రాంతంలో ప్రత్యేక వాహన తనిఖీలు కూడా నిర్వహించారు. ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ తదితర పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనదారులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం చలానాలు జారీ చేసి జరిమానాలు విధించారు. అన్ని వాహన పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అధికారులు సూచించారు.

నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొంటూ ‘నేను సైతం’ ప్రాజెక్టు కింద ప్రతి కాలనీ, వీధి, వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీంతో నేరాల నియంత్రణతో పాటు దర్యాప్తు మరింత సమర్థవంతంగా సాగుతుందని తెలిపారు.

పోలీసులు–ప్రజల మధ్య విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం, కాలనీవాసుల్లో భద్రతా భావాన్ని పెంపొందించడమే ఇటువంటి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ పెద్దలు, యువకులు, మహిళలు, పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :