contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కారంపూడి శివారులో ప్రేమికురాలి దారుణ హత్య.. పెట్రోల్ పోసి దహనం

  • నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన
  • ఐదేళ్ల ప్రేమ వ్యవహారంలో అనుమానాలే హత్యకు కారణమా?
  • మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడు అదుపులో

పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కారంపూడి మండల శివారులో ఓ యువతిని దారుణంగా హత్య చేసి, అనంతరం పెట్రోల్ పోసి దహనం చేసిన సంచలన ఘటన నాలుగు రోజుల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారంలో ఏర్పడిన అనుమానాలే ఈ ఘాతుకానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేటకు చెందిన **షేక్ హసీనా (25)**కు కారంపూడి మండలంలోని ఇనుప రాజుపల్లె గ్రామానికి చెందిన జిలుగు బాలసైదులుతో గత ఐదేళ్లుగా ప్రేమ సంబంధం కొనసాగుతోంది. గుంటూరులో వేర్వేరు ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న సమయంలో పరీక్షా కేంద్రంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం.

ఇటీవల యువతిపై అనుమానం పెంచుకున్న బాలసైదులు, నాలుగు రోజుల క్రితం హసీనాను కారంపూడికి రప్పించాడు. అనంతరం ఎన్ఎస్పీ కాలువ సమీపంలోని చెట్ల మధ్యకు తీసుకెళ్లి హత్య చేసి, ఆనవాళ్లు చెరిపివేయాలనే ఉద్దేశంతో మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది.

హత్య అనంతరం పరారైన నిందితుడు హైదరాబాద్ నుంచి నంద్యాల వైపు వెళ్తున్న సమయంలో తన తండ్రికి ఫోన్ చేసి తాను ఓ యువతిని హత్య చేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన అతని తండ్రి వెంటనే చిలకలూరిపేట పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న చిలకలూరిపేట ఎస్సై సోమేశ్, సీఐ రమేష్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించింది. విచారణలో కారంపూడి శివారులో హసీనాను హత్య చేసి దహనం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడి సూచన మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా, సుమారు 90 శాతం కాలిపోయిన స్థితిలో యువతి మృతదేహం లభ్యమైనట్లు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ ఘటనపై చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో ఏర్పడిన అనుమానాలే ఈ హత్యకు దారితీశాయా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే అంశాలపై కూడా పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.

ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించగా, పూర్తి వాస్తవాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :