- క్రీడలతో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి: ఐజీ చంద్రశేఖర్ రెడ్డి
తూప్రాన్ : తూప్రాన్ పట్టణంలోని ఓలంపియా స్కూల్లో నిర్వహిస్తున్న CBSE ఖో- ఖో ఛాంపియన్షిప్–2026 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మల్టీ జోన్–I ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. తాను పాఠశాల స్థాయిలో ఖో-ఖో, కబడ్డీ ఆడేవాడినని, ప్రస్తుతం టెన్నిస్ ఆడుతున్నానని తెలిపారు. విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని కోరారు.
క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, టీమ్ స్పిరిట్ పెంపొందుతాయని ఐజీ పేర్కొన్నారు. విద్యార్థులు తమకు ఇష్టమైన క్రీడలో నైపుణ్యాన్ని పెంచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఛాంపియన్షిప్లో వివిధ ప్రాంతాల నుంచి పాల్గొంటున్న క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పోటీల్లో క్రీడాస్ఫూర్తితో, స్నేహపూర్వక వాతావరణంలో పాల్గొనాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐలు వెంకట రాజా గౌడ్, సందీప్ రెడ్డి, తూప్రాన్ ఎస్ఐ గంగా రాజు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.








