contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బీడీ కార్మికులు, వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాలి: ఎమ్మెల్యే సంజయ్

మెట్‌పల్లి, జగిత్యాల జిల్లా : బీడీ కార్మికులు, వృద్ధుల సమస్యలను వెంటనే పరిష్కరించి అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు మెట్‌పల్లిలో భారీ ధర్నా నిర్వహించాయి.

పట్టణంలోని పాత బస్టాండ్‌–శాస్త్రి చౌరస్తా వద్ద బీడీ కార్మికులు, వృద్ధులతో కలిసి బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్‌ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో బీడీ కార్మికుల కోసం ప్రత్యేకంగా బీడీ పెన్షన్‌ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. తొలుత రూ.1,000గా ఉన్న పెన్షన్‌ను రూ.2,000కు పెంచి బీడీ కార్మిక మహిళలకు ఆర్థిక భరోసా కల్పించామని పేర్కొన్నారు. పేదలు, వృద్ధులు, వితంతువులకు ఆసరా పెన్షన్ల ద్వారా అండగా నిలిచామని అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పలువురికి పెన్షన్లు మంజూరు కాకపోవడం బాధాకరమని సంజయ్‌ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.4,000 పెన్షన్‌ ఇవ్వలేకపోయినా, కనీసం రూ.2,000 పెన్షన్‌ను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.

అదేవిధంగా పేద కుటుంబాలకు ఉపయోగకరమైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను కొనసాగించాలని, మహిళలు, పేద కుటుంబాలకు అండగా నిలిచిన కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ధర్నా అనంతరం ఎమ్మెల్యే సంజయ్‌ బీడీ కార్మిక మహిళలు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి మెట్‌పల్లి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. బీడీ కార్మిక మహిళలకు బీడీ పెన్షన్‌, అర్హులైన వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే రాష్ట్ర ప్రజలతో కలిసి మరింత పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని ఎమ్మెల్యే సంజయ్‌ హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :