contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

యూరియా బుకింగ్ సమస్యలు .. రైతులకు చిక్కులు

మాసాయిపేట/చిన్నశంకరంపేట : మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాసాయిపేటతో పాటు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల వద్ద మంగళవారం యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ప్రభుత్వం సూచించిన యాప్‌ ద్వారా బుకింగ్ చేసుకున్నప్పటికీ 24 గంటలు గడిచినా యూరియా బస్తాలు అందకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

యూరియా కోసం కొత్తగా ప్రవేశపెట్టిన యాప్‌ ద్వారా బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచించడంతో రైతులు ఉదయం నుంచే తమ మొబైల్‌ ఫోన్లలో బుకింగ్‌ చేసేందుకు ప్రయత్నించారు. అయితే సర్వర్‌ సమస్యలు తలెత్తడంతో బుకింగ్‌ ప్రక్రియ పూర్తికాకపోవడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

సోమవారం ఉదయం 10 గంటలకు యాప్‌లో యూరియా బుకింగ్‌ చేసుకున్నప్పటికీ మంగళవారం మధ్యాహ్నం వరకు కూడా ఒక్క బస్తా యూరియా తీసుకోలేకపోయామని పలువురు రైతులు వాపోయారు. బుకింగ్‌ కోసం గంటల తరబడి ప్రయత్నించడంతో పాటు ఆగ్రోస్‌ కేంద్రాల వద్ద వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు.

ప్రస్తుతం వరి పంటకు నాట్లు పూర్తయి కలుపు తీసే దశలో ఉందని, ఈ సమయంలో పంటకు యూరియా ఎంతో అవసరమని రైతులు పేర్కొన్నారు. అవసరమైన సమయంలో ఎరువు అందుబాటులో లేకపోవడంతో పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

యాప్‌ ఆధారిత బుకింగ్‌ విధానంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. యాప్‌లో బుకింగ్‌ కోసం రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా నేరుగా యూరియా అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పంటలకు అవసరమైన సమయంలో కొరత లేకుండా తగినంత యూరియాను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :