కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్: పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో టౌన్ పోలీసులు గురువారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన తనిఖీల్లో కాలనీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా సుమారు 38 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, మూడు కార్లకు సంబంధించిన పత్రాలు, వివరాలను పోలీసులు పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచుతూ తనిఖీలు నిర్వహించారు.
కాగజ్‌నగర్ టౌన్ సీఐ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ప్రజల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని సీఐ తెలిపారు.








