పల్నాడు జిల్లా, వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండలో సీఐగా పని చేసి ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న చిన్న మల్లయ్యపై అత్యాచార ఆరోపణలు వెలువడడంతో కేసు నమోదు అయింది. ఓ మహిళ తనపై లైంగిక దాడి చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో చిన్న మల్లయ్యకు చెందిన నాటు కోళ్ల ఫారాన్ని తాను అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలోనే చిన్న మల్లయ్య తనపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు.
తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి, ఆమెను వైద్య పరీక్షల కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది. ఒకప్పుడు శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలు నిర్వర్తించిన పోలీస్ అధికారిపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.









