contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రాజాపూర్ లో పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం

గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజాపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు రామగిరి ఎస్‌ఐ తాడవేన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంథని సీఐ బుద్ధే స్వామి గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, యువత గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే విద్య, ఉపాధిపై దృష్టి సారించాలని, చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా బాధ్యతాయుతంగా జీవించాలని పిలుపునిచ్చారు.

అలాగే సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఓటీపీలు, అనుమానాస్పద లింకులు, ఆన్‌లైన్ మోసాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ఏవైనా మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

పోలీస్ కళాబృందం ప్రదర్శించిన అవగాహన కార్యక్రమం గ్రామస్థులను ఆకట్టుకోగా, మత్తు పదార్థాల దుష్పరిణామాలు, సైబర్ నేరాల నివారణ, సామాజిక బాధ్యతలపై సందేశాలు అందించారు.

ఈ కార్యక్రమంలో రాజాపూర్ గ్రామ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి-కొమురయ్య, ఉపసర్పంచ్ కలవేన శ్రీకాంత్, గ్రామ పెద్దలు, గ్రామస్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :