గోదావరిఖని : రామగుండం ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలోని బీ పవర్ హౌస్ టర్నింగ్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం వెనుక చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. చోరీ చేసి ఆటోలో పరారవుతున్న ముగ్గురు వ్యక్తులు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి.
స్థానికులు, భద్రతా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో NTPC తెలంగాణ ప్లాంట్‌లోని BHEL యార్డులో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి ప్లాంట్‌లోని FGD యంత్రాలకు సంబంధించిన ఇనుప రింగ్‌ను చోరీ చేశారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుకు ఆటో శబ్దం వినిపించడంతో అనుమానం వచ్చి వెంటనే తోటి సిబ్బందిని అప్రమత్తం చేశారు.
అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది బైక్‌లపై ఆటోను వెంబడించారు. చోరీ చేసిన ఇనుప రింగ్‌ను ఆటోలో తీసుకెళ్లుతూ తప్పించుకునే ప్రయత్నంలో రామగుండం బీ పవర్ హౌస్ టర్నింగ్ వద్ద ఆటో అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై వెంటనే NTPC పోలీసులకు సమాచారం అందించిన సెక్యూరిటీ సిబ్బంది, 108 అంబులెన్స్ సాయంతో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, చోరీకి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై NTPC పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుల వివరాలు విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.








