అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో గుత్తి పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ముందు సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ మాట్లాడుతూ గుత్తి పట్టణంలో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు 2026-27 విద్యా సంవత్సరానికి ముందస్తుగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు.
పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి పెట్టకుండా ముందస్తు అడ్మిషన్లపై విద్యాసంస్థలు అధిక శ్రద్ధ చూపుతున్నాయని విమర్శించారు. ఈ సమయంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్లు చేపడితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
అందువల్ల ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న ముందస్తు అడ్మిషన్లను తక్షణమే అరికట్టాలని, అలాగే అధిక ఫీజులను నియంత్రించాలని ఏఐఎస్ఎఫ్ తరపున డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే కార్పొరేట్ విద్యాసంస్థల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ మేరకు ఎంఈఓ రవి నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు వంశీ, పురుషోత్తం, రఫీ, రంజిత్, వేణు, తేజేశ్వర్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.








