అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు దుకాణాలు, హోటళ్లు, వ్యాపార సంస్థలను పరిశీలించి బాల కార్మికుల నియామకంపై అవగాహన కల్పించారు.
తనిఖీల సందర్భంగా 18 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టవిరుద్ధమని, బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. బాలల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా ప్రతి ఒక్కరూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాలని కోరారు.
ఈ అవగాహన కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు, జిల్లా సర్కిల్ పరిధిలోని గుంతకల్లు, తాడిపత్రి లేబర్ కార్యాలయాల అధికారులు ప్రతాప్ నాయుడు, సుజాత, శివ ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే విద్యాశాఖకు చెందిన క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ రవీంద్ర కుమార్, గంగానాయక్, సువర్ణ, లలితమ్మ, విద్యాబాయ్, 1098 చైల్డ్‌లైన్ ప్రతినిధి ఇర్ఫాన్, రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అనిత, సందీప్, పోలీసు శాఖ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తదితరులు పాల్గొని వ్యాపారులకు, ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు.
బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, బాల కార్మికుల నియామకం గమనించినట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు లేదా చైల్డ్‌లైన్ 1098కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.








