contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలంగాణలో హిట్లర్ పాలన .. కాంగ్రెస్ పై హరీష్ రావు కామెంట్స్

ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో పేదల ఇళ్ల కూల్చివేతల అంశంపై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి టి. హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హిట్లర్ తరహా పాలన సాగిస్తోందని, పేదలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం వారిపైనే దమనకాండకు పాల్పడుతోందని ఆరోపించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేదల పక్షాన నిలవాల్సింది పోయి భూ ఆక్రమణదారుడిగా వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రఘునాథపాలెంలో ఇళ్ల స్థలాల నిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన హరీశ్ రావు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్వే నంబర్ 218 పరిధిలో 625 నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని గుర్తుచేశారు. గృహలక్ష్మి పథకం ద్వారా ఇళ్ల నిర్మాణానికి కూడా సహకారం అందించామని తెలిపారు. ఆ పట్టాల ఆధారంగా పేదలు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపడితే, ప్రస్తుత ప్రభుత్వం జేసీబీలతో వాటిని కూల్చివేయడం బాధాకరమని అన్నారు.

ప్రభుత్వ చర్యల వల్ల నిరుపేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్న ఆయన, భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 30న చింతకాని మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న ‘రైతు ఆశీర్వాద సభ’పై కూడా హరీశ్ రావు విమర్శలు చేశారు. రైతుబంధు నిధుల చెల్లింపులు, రుణమాఫీ అమలు, ధాన్యం కొనుగోళ్ల అంశాల్లో ప్రభుత్వం రైతులను నిరాశపరిచిందని ఆరోపిస్తూ, ఆ సభను ‘రైతుల క్షమాపణ సభ’గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వడ్డిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పలువురు ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కాగా, ఇటీవల భూ వ్యవహారాలు, మైనింగ్ అంశాలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో హరీశ్ రావు చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :