గుత్తి : అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు చెట్నేపల్లికి చెందిన గద్దల హేమంత్ ఫుట్‌బాల్ జాతీయ జట్టుకు ఎంపికైనట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సోమవారం ప్రకటించింది.
విజయవాడలో ఇటీవల నిర్వహించిన అండర్-21 జాతీయ ఫుట్‌బాల్ జట్టు ఎంపిక పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో అనంతపురం జిల్లా నుంచి ముగ్గురు మాత్రమే అవకాశం పొందగా, ఆర్డీటీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ద్వారా పాల్గొన్న హేమంత్ జాతీయ జట్టుకు ఎంపిక కావడం విశేషంగా నిలిచింది.
చిన్ననాటి నుంచే క్రీడల పట్ల ఆసక్తి కనబరిచిన హేమంత్, ఆర్డీటీ ఫుట్‌బాల్ అసోసియేషన్‌లో శిక్షణ పొందుతూ తన ప్రతిభను మెరుగుపరుచుకున్నాడు. మదనపల్లిలో జరిగిన విన్నర్స్ ట్రోఫీ, రేణిగుంటలో రన్నర్స్ ట్రోఫీ, పత్తికొండలో రన్నర్స్ ట్రోఫీ, కడపలో రన్నర్స్ ట్రోఫీతో పాటు సౌత్ జోన్ యూనివర్సిటీ పోటీలు, కర్ణాటక యునైటెడ్ ఎఫ్‌సీ వైట్‌ఫీల్డ్ క్లబ్ టోర్నమెంట్లలో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచాడు. ఈ క్రమంలో విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపికల్లోనూ చోటు దక్కించుకున్నాడు.
హేమంత్ జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో అతని తల్లిదండ్రులు గద్దల రమణ, అంజలి హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హేమంత్ తిరుపతిలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నట్లు తెలిపారు.
గుత్తి పట్టణంలో ఫుట్‌బాల్ క్రీడకు మంచి ఆదరణ ఉండగా, స్థానిక యువకుడు జాతీయ జట్టుకు ఎంపిక కావడం పట్ల క్రీడాభిమానులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ హేమంత్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.








