contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఉపాధి హామీలో ‘దొంగ’ వేట: 60 లక్షల ప్రజాధనం స్వాహా?

● ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు !

కరీంనగర్ జిల్లా: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కొందరికి అక్షయపాత్రలా మారింది. కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, ఖాసీంపేట గ్రామంలో గత 3-4 ఏళ్లుగా సాగుతున్న భారీ అవినీతి బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ అధికార బలంతో ఉపాధి కూలీలను తన సొంత వ్యవసాయ పనులకు వాడుకుంటూ, ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారని గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వక ఫిర్యాదు చేశారు.

◆ అక్రమాల చిట్టా ఇదే:
◆ సొంత పనులకు కూలీలు:

ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీలత, ఉపాధి హామీ కూలీలను నిబంధనలకు విరుద్ధంగా తన సొంత పొలం పనులకు వాడుకుంటూ, వారికి మస్టర్ వేసి ప్రభుత్వ నిధులను కాజేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

◆ నకిలీ మస్టర్లు – బినామీ పేర్లు:

గ్రామంలో లేని వారి పేర్ల మీద, చనిపోయిన వారి పేర్ల మీద, చివరకు పక్షవాతంతో మంచాన పడ్డ వారి పేర్ల మీద కూడా 100 రోజుల పని పూర్తి చేసినట్లు రికార్డులు సృష్టించారు.

◆ ఫోటోల మాయాజాలం:

ఒకరి ఫోటో పెట్టి మరొకరి పేరుతో డబ్బులు డ్రా చేయడం, పాత పశువుల కొట్టాలు, కొత్తగా కట్టినట్లు చూపించి లక్షల రూపాయలు కాజేయడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు బాధితులు సాక్ష్యాలతో సహా పేర్కొన్నారు.

◆ 60 లక్షల కుంభకోణం: గత పాలకుల అండదండలతో సుమారు 50 నుంచి 60 లక్షల రూపాయల వరకు ప్రజాధనాన్ని ఫీల్డ్ అసిస్టెంట్, సర్పంచ్ మరియు ఇతర అధికారులు కలిసి పంచుకున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమైన సాక్ష్యాలు:
ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం… గతంలో జరిగిన తనిఖీల్లో (Social Audit) తప్పులు దొరికినా, కేవలం నామమాత్రపు జరిమానాలతో అధికారులు చేతులు దులుపుకున్నారని సమాచారం. నగయ్య అనే వ్యక్తి కరీంనగర్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నా, ఇక్కడ పని చేసినట్లు మస్టర్ వేయడం వారి బరితెగింపుకు నిదర్శనం. “ప్రభుత్వ నిధులను కాజేస్తూ, అర్హులైన కూలీలకు అన్యాయం చేస్తున్న సదరు ఫీల్డ్ అసిస్టెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. సమగ్ర విచారణ జరిపి దోచుకున్న సొమ్మును రికవరీ చేయాలనీ .” ఖాసీంపేట గ్రామస్తులు కోరుతున్నారు.

ఈ ఫిర్యాదుపై జిల్లా యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుందో, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :