contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హిందూ మత సంఘాల ప్రతినిధులతో సీపీ సమీక్షా సమావేశం

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్, గోరక్ష ప్రముఖ్ తదితర హిందూ మత సంఘాల ప్రతినిధులతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశంలో సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ, పండుగల సమయంలో ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించబోమని స్పష్టం చేశారు. పశువుల అక్రమ రవాణా లేదా గోవధకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, స్వయంగా చట్టాన్ని అమలు చేసే ప్రయత్నం చేయవద్దని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ‘తెలంగాణ గోవధ నిషేధ మరియు జంతు సంరక్షణ చట్టం–1977’ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణాపై పూర్తి నిషేధం అమలులో ఉందని పేర్కొన్న సీపీ, పశువుల రవాణాకు సంబంధించి వెటర్నరీ వైద్యులు జారీ చేసే ‘ఫిట్ ఫర్ ట్రాన్స్‌పోర్ట్’ ధ్రువపత్రాలను తప్పనిసరిగా తనిఖీ చేస్తామని తెలిపారు.

పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 121 చెక్‌పోస్టులు, 52 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు పనిచేస్తున్నాయని వెల్లడించారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా ఆరు వ్యూహాత్మక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముగ్ధంపూర్, చింతకుంట, ఆర్నకొండ, తుర్కాసినగర్, రేణికుంట, హుజురాబాద్ పరకాల క్రాస్‌రోడ్డు ప్రాంతాల్లో ఈ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

రానున్న రెండు వారాల పాటు ఈ చెక్‌పోస్టుల వద్ద నిరంతర తనిఖీలు నిర్వహించడంతో పాటు, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, చట్టాన్ని ఉల్లంఘించి పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుల ప్రథమ బాధ్యత అని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని సీపీ గౌష్ ఆలం కోరారు.

ఈ సమావేశంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు రాంచందర్ రావు, సృజన్ రెడ్డి, హిందూ సంఘాల నాయకులు ఉట్కూరి రాధాకృష్ణ రెడ్డి, రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :