నిజామాబాద్: టౌన్-6 పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై చీత ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి ఐదుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐపీఎస్ వెల్లడించారు.
కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్న నేపథ్యంలో, సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీత ఫోర్స్ సిబ్బంది ఈ దాడిని చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా జైలు పక్కన ఉన్న ప్రాంతంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించగా, కొందరు వ్యక్తులు బహిరంగంగా పేకాట ఆడుతూ కనిపించారు.
వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఈ దాడిలో మొత్తం ఐదుగురిని పట్టుకోగా, వారి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు మరియు రూ.12,530 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడిన వారిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం టౌన్-6 పోలీస్ స్టేషన్ కు అప్పగించారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, కమిషనరేట్ పరిధిలో పేకాట, గుట్కా, గంజాయి, డ్రగ్స్ తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో పేకాట, గంజాయి, డ్రగ్స్ లేదా ఇతర అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.








