అనకాపల్లి, జూన్ 3: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం పరిధిలోని పనసలపాడు గ్రామంలో భూ వివాదానికి సంబంధించిన అంశంపై గిరిజనులు, ప్రజాసంఘాల నాయకులు బుధవారం ధర్నా నిర్వహించారు. సర్వే నంబర్ 6/1, 6-9.8-1లోని భూమి గిరిజన రైతు గెమ్మిల సింగన్న దొర జిరాయితీ భూమిగా సెటిల్మెంట్ రికార్డుల్లో నమోదై ఉందని వారు పేర్కొన్నారు.
గిరిజనుల కథనం ప్రకారం, రీ-సర్వే సమయంలో 2022లో ఈ భూమికి సంబంధించి ఇతరులకు పట్టాలు మంజూరు చేయడంతో వివాదం తలెత్తింది. అప్పట్లో గిరిజనులు ఆందోళన చేపట్టగా, నర్సీపట్నం ఆర్డీవో మరియు అప్పటి తహసీల్దార్ ఈ భూమిని వివాదాస్పద భూమిగా పరిగణించి పట్టాలను ఎంఆర్వో కార్యాలయంలోనే నిల్వ ఉంచినట్లు కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు తెలిపారు.
అయితే ప్రస్తుతం వివాదాస్పద భూమిగా నమోదైనప్పటికీ, సంబంధిత వివరాలు వెబ్‌ల్యాండ్ 1-బి రికార్డుల్లో ప్రతిబింబించకపోవడంతో ఇతరులకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అవుతున్నాయని, వారు బ్యాంకు రుణాలు కూడా పొందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై పీజీఆర్ఎస్ ద్వారా కలెక్టర్ కార్యాలయం, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
తహసీల్దార్ కార్యాలయం నుంచి అందిన ఎండార్స్మెంట్లో వెబ్‌ల్యాండ్‌లో డిస్ప్యూట్ మార్క్ నమోదు చేసే అధికారం జాయింట్ కలెక్టర్‌కు ఉందని పేర్కొన్నారని, అయితే రెండేళ్లు గడిచినా సంబంధిత ప్రక్రియ పూర్తికాలేదని ఆరోపించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తహసీల్దార్ ఆర్డీవోకు నివేదిక పంపాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.
ఇప్పటికే ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేసినట్లు గిరిజనులు తెలిపారు. ఫిర్యాదుకు సంబంధించి స్థానిక తహసీల్దార్ సమగ్ర నివేదికను లోకాయుక్తకు పంపారని, దానిపై తమ అభ్యంతరాలను సమర్పించాల్సిందిగా లోకాయుక్త కార్యాలయం సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో భూమిని వెంటనే వెబ్‌ల్యాండ్ 1-బి రికార్డుల్లో డిస్ప్యూట్ రిజిస్టర్‌గా నమోదు చేసి న్యాయం చేయాలని కోరుతూ పనసలపాడులో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో గెమ్మిల చిన్నబ్బాయి, గెమ్మిల లావరాజు, గెమ్మిల చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కెవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఇ. చిరంజీవి మాట్లాడుతూ, వారం రోజుల్లోగా సంబంధిత భూమిని వెబ్‌ల్యాండ్ డిస్ప్యూట్ రిజిస్టర్లో నమోదు చేయకపోతే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.









