పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం మరియు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి తోయక జగదీశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేసి, చిన్నారులతో కలిసి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్య ప్రారంభ దశలో అక్షరాభ్యాసం ఎంతో కీలకమైందని, విద్యార్థుల భవిష్యత్తుకు ఇది బలమైన పునాది అవుతుందని పేర్కొన్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ విద్యాభ్యాసంలో తోడ్పాటు అందించాలని సూచించారు. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి చిన్నారికి విద్య అందేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించగా, చిన్నారులు ఆనందంగా అక్షరాభ్యాసంలో పాల్గొన్నారు.








