చినజీయర్ జీయర్ స్వామిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివాసీల వనదేవత సమ్మక్క, సారలమ్మలను అవమానించేలా చినజీయర్ మాట్లాడారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది.
ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షుడు మల్లుదొర మాట్లాడుతూ, ఆదివాసీ ఆడబిడ్డల చరిత్ర తెలియని చినజీయర్ కు వారి గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. జనాల దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న చరిత్ర చినజీయర్ దని విమర్శించారు. సమ్మక్క, సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా చినజీయర్ పై మండిపడిన సంగతి తెలిసిందే. సమతామూర్తి విగ్రహాన్ని చూడటానికి చినజీయర్ రూ. 150 టికెట్ ధర పెట్టారని… మీది బిజినెస్ అని.. సమ్మక్క, సారలమ్మ తల్లుల దగ్గర అలాంటి వ్యాపారం జరగదని అన్నారు.