contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

భూ రికార్డుల లోపాలపై రైతుల ఆందోళన

అనకాపల్లి జిల్లా, కే.కోటపాడు మండలం : కే.కోటపాడు మండలంలోని కేజే పురం, కోరువాడ రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో జరిగిన తప్పిదాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రెవెన్యూ అధికారులు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు ఆరోపించారు.

ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో “స్పందన”, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న పీవీజీఆర్‌ఎస్ (PVGRS) రెవెన్యూ సదస్సులు, “ఒక మండలం–ఒక గ్రామం” కార్యక్రమాలు, నెలకు నాలుగు సార్లు అధికారులు గ్రామాలను సందర్శిస్తున్నప్పటికీ, రీ-సర్వేలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని రైతులు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

2020లో జగనన్న ఈ-సర్వేను పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించిన సమయంలో కోరువాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 327-1, 327-3లో గత 50 సంవత్సరాలుగా తొమ్మిది మంది రైతులు సాగు చేస్తున్న సుమారు మూడు ఎకరాల జిరాయితి పట్టా భూమిని సర్వీస్ ఇనాం భూమిగా నమోదు చేశారని తెలిపారు. అదే సమయంలో సర్వే నంబర్ 327-4లో ఉన్న చాకలి ఇనాం భూమిని పలుకుబడి కలిగిన వ్యక్తులకు జిరాయితి పట్టాగా మార్చి పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేశారని ఆరోపించారు.

అలాగే సర్వే నంబర్లు 238, 279, 252, 278, 246-2, 246-3లో పట్టాలు ఉన్న రైతుల భూములను రీ-సర్వేలో గయ్యాల భూములుగా నమోదు చేయడంతో రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలైన రైతు భరోసా వంటి ప్రయోజనాలు కూడా పొందలేకపోతున్నారని పేర్కొన్నారు.

కేజే పురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 189-1 నుంచి 189-20 వరకు గత 20 ఏళ్ల క్రితం కొల్లుగీత కార్మికులకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని, వారు ప్రస్తుతం మామిడి తోటలపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. అయితే 2020 రీ-సర్వే అనంతరం వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో ఈ సర్వే నంబర్లు, పట్టాల వివరాలు కనిపించకుండా పోయాయని, పీవీజీఆర్‌ఎస్‌లో పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యలపై సుమారు 50 మంది రైతులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయగా, కలెక్టర్ సంబంధిత రెవెన్యూ కార్యదర్శులను పిలిపించి వివరాలు అడిగారని తెలిపారు. సరైన సమాధానం ఇవ్వలేకపోవడంతో కోరువాడ రెవెన్యూ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు, అలాగే తహసీల్దార్‌కు పది రోజుల్లో క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు గోవిందరావు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావుతో పాటు కళ్లుగీత కార్మిక సంఘం నాయకులు కక్కల అర్జున్, కక్కల రామ, పలువురు రైతులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :