contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కాకినాడ ఐకాన్ గా నిలిచిన “బ్రహ్మంగారి మఠాన్ని” పునర్నిర్మాణం చేయాలి

కాకినాడ : కాకినాడ జిల్లా కేంద్రంలోని ఉప్పుటేరును ఆనుకుని వార్ఫ్ రోడ్డులో గంజాం వారి వీధి జంక్షన్ వద్ద ఉన్న చారిత్రక పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠాన్ని అత్యవసరంగా పునరుద్ధరించాలని స్వయంభు భోగి గణపతి పీఠం ప్రభుత్వాన్ని కోరింది. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి ప్రసిద్ధి చెందిన ఈ మఠం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, దీనిని పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యతగా భావించాలని పీఠం ప్రతినిధులు పేర్కొన్నారు.

గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, ఈ మఠం కాకినాడ నగరానికి ఆధ్యాత్మిక గుర్తింపుగా నిలిచిందని అన్నారు. మఠాన్ని ఎవరు నిర్మించారో, ప్రస్తుతం ఎవరు నిర్వహిస్తున్నారో గుర్తించి, దాని పునర్నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ప్రత్యేక నిధులను వినియోగించి మఠాన్ని పునరుద్ధరించాలని సూచించారు. మఠం ప్రాంగణంలోని రేవు పిండప్రదానాలకు ప్రధాన కేంద్రంగా ఉండటంతో, రాజమహేంద్రవరంలోని కోటిలింగాల రేవు తరహాలో అభివృద్ధి చేయాలని కోరారు.

గతంలో స్మార్ట్ సిటీ ప్రణాళికలో కొంత అభివృద్ధి జరిగినప్పటికీ, ప్రస్తుతం ఉప్పుటేరు ఒడ్డున స్నాన ఘాట్, భక్తులకు షెల్టర్లు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాలు, మఠాలు, పీఠాలు జీర్ణావస్థలో ఉన్నప్పటికీ వాటిని పునరుద్ధరించకుండా వదిలేయడం శుభప్రదం కాదని పేర్కొన్నారు.

బనగానపల్లెలోని వీరబ్రహ్మేంద్రస్వామి మఠం అభివృద్ధి, వసతి గృహాల నిర్మాణం, అలాగే పలు జిల్లాల్లోని బ్రహ్మంగారి ఆలయాల పునర్నిర్మాణానికి టీటీడీ నిధులు అందిస్తున్న నేపథ్యంలో, కాకినాడలోని ఈ చారిత్రక మఠానికి కూడా అదే విధంగా నిధులు మంజూరు చేసి పునరుద్ధరణ చేపట్టాలని కోరారు.

గణపతి పీఠం 976వ వారోత్సవాల సందర్భంగా త్రినాథ వ్రత వేదిక, శ్రీవారి సేవా సమితి, హరహర మహాదేవ భజన సమాఖ్య సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి, టీటీడీ చైర్మన్, జిల్లా కలెక్టర్‌కు భక్తుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని పంపించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :