పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ 21వ డివిజన్ కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ శుక్రవారం టీజీఎన్పీడీసీఎల్ (TGNPDCL) అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీ)కు వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలో లక్ష్మీపురం, ఎల్కలపల్లి, గేట్ జీపీ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పలుచోట్ల పాత విద్యుత్ స్తంభాలు విరిగిపోయి శిథిలావస్థకు చేరడంతో అవి ప్రమాదకరంగా మారాయని, వాటి స్థానంలో వెంటనే కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరారు.
అదేవిధంగా, ఆయా ప్రాంతాల్లో తక్కువ వోల్టేజ్‌తో విద్యుత్ సరఫరా జరుగుతుండటంతో గృహాల్లోని ఎలక్ట్రికల్ పరికరాలు దెబ్బతింటున్నాయని స్థానిక ప్రజలు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ సమస్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించి సురక్షితమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ టీజీఎన్పీడీసీఎల్ అధికారులను కోరారు.








