కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్ : పేదలకు సరఫరా చేయాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను కాగజ్‌నగర్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 18 క్వింటాళ్ల బియ్యంతో పాటు రవాణాకు ఉపయోగిస్తున్న మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, స్థానిక రేషన్ కార్డు దారుల నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని సేకరించి, మహారాష్ట్రకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బియ్యాన్ని తరలిస్తున్న మూడు ఆటోలను అదుపులోకి తీసుకుని, అక్రమ రవాణాను అడ్డుకున్నారు.
ఈ కేసులో సయ్యద్ సికిందర్ అలీ, షేక్ ఖాజా మొయినుద్దీన్, షేక్ ఆరిఫ్‌లను నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేశారు. అనంతరం సోమవారం వారిని కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
డీఎస్పీ హెచ్చరిక
పీడీఎస్ బియ్యం దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ స్పష్టం చేశారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అక్రమాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.








