- ప్రజాధనంతో ‘సొంత’ వ్యవసాయం:
- ఖాసీంపేట ఫీల్డ్ అసిస్టెంట్ బాగోతం బట్టబయలు!
- అధికారుల విచారణలో అడ్డంగా దొరికిన అవినీతి తిమింగలం.. కేవలం షోకాజ్ నోటీసులతో సరిపెడతారా? రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతారా? గ్రామస్థుల ఆగ్రహం
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం ఖాసీంపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలను తన సొంత మక్క జొన్న చేను పనులకు మళ్లించిన ఫీల్డ్ అసిస్టెంట్. పై ఎంపీఓ, ఏపీఓల విచారణ.. షోకాజ్ నోటీసు జారీ.అధికార పార్టీ నేతల ఒత్తిడితో విచారణ నీరుగారుస్తారా?వివరాల్లోకి వెళ్తే.ప్రభుత్వ నిధులను కాపాడి, పేద కూలీలకు అండగా ఉండాల్సిన వారే భక్షకులుగా మారుతున్నారు. ఖాసీంపేట గ్రామంలో ఉపాధి హామీ పథకాన్ని అడ్డం పెట్టుకుని ఫీల్డ్ అసిస్టెంట్ సాగిస్తున్న అక్రమ దందా ఇప్పుడు జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. కూలీల చెమట చుక్కల సొమ్ముతో తన సొంత వ్యవసాయ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న తీరు పత్రికల సాక్షిగా బట్టబయలైంది.
◆ తనిఖీల్లో దొరికిన అక్రమాలు
గురువారం నాడు ప్రభుత్వ రికార్డుల్లో కూలీలు పని చేస్తున్నట్లు చూపిస్తూ, వాస్తవానికి వారందరినీ తన వ్యక్తిగత పొలం పనులకు వాడుకుంటూ ఫీల్డ్ అసిస్టెంట్ అడ్డంగా దొరికిపోయారు. మక్క కంకులను ట్రాక్టర్లో పోస్తున్న దృశ్యాలను చూసి స్థానికులు విస్తుపోయారు.
◆ అధికారుల స్పందన – నామమాత్రపు చర్యలేనా?
పత్రికల్లో వచ్చిన కథనానికి స్పందించిన ఎంపీఓ సురేందర్, ఏపీఓ చంద్రశేఖర్, టీ ఏ శంకర్ & పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. అక్రమం జరిగినట్లు నిర్ధారణ కావడంతో సదరు ఫీల్డ్ అసిస్టెంట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయితే, ఎంపీడీఓ పర్యటనలో ఉన్నారనే సాకుతో కఠిన చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
◆ రాజకీయ ‘హస్తం’.. వ్యవస్థపై ఒత్తిడి?
ఈ అవినీతి వ్యవహారం వెనుక అధికార పార్టీకి చెందిన కీలక నేతల అండదండలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. సదరు ఫీల్డ్ అసిస్టెంట్‌ను కాపాడేందుకు రాజకీయ నేతలు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. “తప్పు చేసినట్లు సాక్ష్యాధారాలు ఉన్నా, కేవలం నోటీసులతో సరిపెట్టడం వెనుక మతలబు ఏంటి?” అని గ్రామస్థులు నిలదీస్తున్నారు.
“ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమ సంపాదనలో రాజకీయ నాయకులకు కూడా వాటాలు అందుతున్నాయా? అందుకే ఇంతలా
వెనుకేసుకొస్తున్నారా?” ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఖాసీంపేట గ్రామస్తులు.
◆ ప్రజల డిమాండ్ ఇదే!
- కేవలం నోటీసులతో ఈ వ్యవహారాన్ని సర్దిపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
- అవినీతికి పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్‌ను వెంటనే విధుల నుండి తొలగించాలి
- దుర్వినియోగమైన ప్రజాధనాన్ని తక్షణమే రికవరీచేయాలి.
- ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
- పత్రికలు సామాజిక బాధ్యతగా ఈ అక్రమాన్ని వెలుగులోకి తెచ్చినందుకు ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
- మరి అధికారులు వ్యవస్థను కాపాడుతారా లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతారా అన్నది వేచి చూడాలి.








