మెదక్ జిల్లా , తూప్రాన్ : తూప్రాన్ మండలంలోని నాగులపల్లి గ్రామ పరిధిలో అక్రమంగా మట్టి తవ్వకాలపై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) ఎన్. అనురాధ తూప్రాన్ పోలీస్ స్టేషన్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు.
ఫిర్యాదులో నాగులపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి గ్రామ పరిధిలోని పటేల్ కుంట నుంచి అక్రమంగా మట్టిని తవ్వి తరలించినట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారుల పరిశీలనలో కుంటలో భారీగా, లోతుగా మట్టి తవ్వకాల కారణంగా కుంట బలహీనపడే ప్రమాదం ఉందని వెల్లడైంది.
వర్షాకాలంలో కుంటలో నీరు నిండిన సమయంలో జలస్రావం జరిగే అవకాశం ఉండటంతో గ్రామ ప్రజలు, పశువులకు ప్రమాదం సంభవించే పరిస్థితులు ఉన్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు నష్టం కలిగించే విధంగా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్. అనురాధ ఫిర్యాదు ఆధారంగా తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.








