మెదక్ జిల్లా – చిన్నశంకరంపేట : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వెనుక అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల సుదీర్ఘ పోరాటం ఉన్నాయని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, సంక్షేమం, మౌలిక సదుపాయాల రంగాల్లో విశేష అభివృద్ధి సాధించిందని ఆమె తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని పేర్కొన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాల్సిన అవసరం ఉందన్నారు.
అమరవీరుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తెలంగాణ అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు లావణ్య రెడ్డి, సత్యనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, బక్కన్న శ్రీనివాస్ రెడ్డి, హేమ శ్రీనివాస్, బైండ్ల రాజు, పడాల శ్రీనివాస్, జాల సునీల్, తాళ్ల రాజు, చాకలి నవీన్, మాజీ సర్పంచ్ సూల దయాకర్, కర్రే సత్తయ్య, మాజీ సర్పంచ్ లంబాడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.








