contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కలెక్టర్ ఉత్తర్వులు బేఖాతర్‌ .. కాకినాడలో వేలాది అనధికార ఫ్లెక్సీలు

  • ‘ఫ్లెక్స్ ఫ్రీ సిటీ’ ఆదేశాలు అమలులో నిర్లక్ష్యం.. కాకినాడలో వేలాది అనధికార ఫ్లెక్సీలు
  • కార్పొరేషన్ అధికారులపై పౌర సంక్షేమ సంఘం ఆగ్రహం

కాకినాడ నగరాన్ని ‘ఫ్లెక్స్ ఫ్రీ సిటీ’గా మార్చేందుకు జిల్లా కలెక్టర్ ఇటీవల జారీ చేసిన ఆదేశాలు అమలులోకి రాకపోవడంపై పౌర సంక్షేమ సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అనుమతి లేని ఫ్లెక్సీ బోర్డులపై కఠిన చర్యలు తీసుకోవాలని, జరిమానాలు విధించాలని కలెక్టర్ ఆదేశించి మూడు రోజులు గడిచినా నగర పాలక సంస్థ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యకరమని సంఘం పేర్కొంది.

పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ సర్పవరం జంక్షన్ నుంచి అమ్మమ్మఘాటి వరకు ప్రధాన రహదారులు, వంతెనలు, కూడళ్ల వద్ద వెయ్యికి పైగా అనధికార ఫ్లెక్సీ బోర్డులు కొనసాగుతున్నాయని తెలిపారు. కలెక్టర్ ఉత్తర్వులు వెలువడినప్పుడు నగర ప్రజలు స్వాగతించినప్పటికీ, ప్రస్తుతం వాటి అమలులో కనిపిస్తున్న నిర్లక్ష్యాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్న పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు.

అధికార కూటమి పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాటిపై చర్యలు లేకపోవడంతో కూటమి నాయకులకు మినహాయింపు ఇచ్చారా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని రమణరాజు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను అధికార పార్టీ నేతలే పట్టించుకోకపోవడం విచారకరమని ఆయన అన్నారు.

నగర పాలక సంస్థ అధికారులు తమ బాధ్యతను గుర్తించి వెంటనే అనధికార ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అధికారులు చర్యలు తీసుకోకపోతే సంబంధిత అధికారులపై జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని కోరారు.

ప్రభుత్వ ఉత్తర్వులు, జిల్లా కలెక్టర్ ఆదేశాలు అమలు కాకపోతే ప్రజలు ఎవరిని ప్రశ్నించాలనే పరిస్థితి ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఫ్లెక్స్ ఫ్రీ కాకినాడ’ లక్ష్యాన్ని సాధించాలంటే రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఫ్లెక్సీల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.

రెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సూర్యకళామందిరంలో సమావేశమవుతున్న కూటమి నేతలు ఫ్లెక్స్ ఫ్రీ సిటీ అమలుపై స్పష్టమైన తీర్మానం చేసి పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేయాలని రమణరాజు డిమాండ్ చేశారు.

నగర సౌందర్యం, రహదారి భద్రత, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఫ్లెక్స్ ఫ్రీ సిటీ లక్ష్యాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పౌరసంఘాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, కలెక్టర్ ఆదేశాల అమలుపై నగర పాలక సంస్థ అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :