తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మురి మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు.
అవినీతి కార్యకలాపాలకు పాల్పడి అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలతో మల్లారెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన నివాసంతో పాటు బంధువులు, బినామీలకు చెందిన మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
సోదాల సందర్భంగా ఐదు భవనాలు, అందులో నాలుగు నివాస గృహాలు, ఒక వాణిజ్య సముదాయం, ఎనిమిది ఖాళీ ప్లాట్లు, 10.23 ఎకరాల వ్యవసాయ భూమిని అధికారులు గుర్తించారు. అదనంగా రూ.3.31 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.50 లక్షల డిపాజిట్లు, ఒక గ్రాండ్ విటారా కారు, ఒక టీవీఎస్ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం స్వాధీనం చేసుకున్న ఆస్తుల డాక్యుమెంట్ విలువ సుమారు రూ.3 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో వీటి విలువ మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
మల్లారెడ్డి భార్య, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న మూడు బ్యాంకు లాకర్లను కూడా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. విచారణలో భాగంగా వాటిని త్వరలో తెరిచి పరిశీలించనున్నట్లు తెలిపారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నట్లు పేర్కొన్నారు.
కాగా, వారం రోజుల క్రితమే ల్యాండ్స్ అండ్ సర్వేస్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిని కూడా ఏసీబీ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో సుమారు రూ.13 కోట్లకు పైగా ఆస్తులు, రూ.1.54 కోట్ల నగదు, భారీ మొత్తంలో బంగారం వెలుగుచూసింది.
వరుసగా అవినీతి అధికారులపై ఏసీబీ దాడులు, అరెస్టులు కొనసాగుతుండటంతో ప్రభుత్వ శాఖల్లో కలకలం రేగింది. అక్రమాస్తులపై దర్యాప్తు మరింత విస్తృతంగా కొనసాగే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.








